Lokpal: అవినీతి కేసుల విచారణలో లోక్‌పాల్‌కు అడ్డంకులు..! 4 d ago

సిబ్బంది, శిక్షణ శాఖ పద్దు (2025-26)పై చర్చ సందర్భంగా సంబంధిత కమిటీ పార్లమెంటులో తన 145వ నివేదికను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో లోక్ పాల్ లో అత్యంత కీలకమైన దర్యాప్తు, విచారణ విభాగాలు లేకపోవడంతో దాని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వీటిని ఆరు నెలల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది.
దర్యాప్తు, విచారణ విభాగాల ఏర్పాటులో జాప్యం కారణంగా లోక్ పాల్ స్వతంత్రంగా, సమర్థంగా పనిచేయడంలో ఆటంకం కలుగుతోందని ఈ నివేదిక తెలిపింది. దీనిపై సిబ్బంది, శిక్షణ శాఖ స్పందిస్తూ.. ఆయా విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అప్పటివరకు సంబంధిత పనులను ప్రస్తుతానికి సీవీసీ, సీబీఐలు చేస్తున్నట్లు తెలిపింది.
బయటి ఏజెన్సీల కారణంగా అభియోగాల దర్యాప్తు, విచారణలో జాప్యంతో లోక్పాల్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు బ్రిజ్లాల్ నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. నియమిత కాలవ్యవధిలోనే దర్యాప్తు, విచారణ విభాగాలను ఏర్పాటు చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
ప్రభుత్వోద్యోగుల పై ఉన్న అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను 'అంబుడ్స్ మన్' పేరుతో తొలిసారిగా స్వీడన్ (1809)లో ఏర్పాటు చేశారు. అంబుడ్స్ మన్ అంటే ప్రజల న్యాయవాది అని అర్థం.
లోక్‌పాల్/ లోకాయుక్త వ్యవస్థ:
1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో నార్వే దేశాలు అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
సోషలిస్టు దేశాలైన సోవియట్ రష్యా, చైనా, పోలెండ్, హంగేరి, చెకోస్లోవేకియా, రుమేనియాలు ప్రొక్యురేటర్ వ్యవస్థ పేరుతో అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దేశంలో ‘లోక్పాల్' వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి. దేశ్ ముఖ్ ప్రతిపాదించారు.
పార్లమెంటు సభ్యుడైన లక్ష్మీమాల్ సింఘ్వీ 1963లో 'లోక్ పాల్' వ్యవస్థకు రూపకల్పన చేశారు. 1966లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం లోక్ పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అంబుడ్స్ మన్ (లోక్ పాల్, లోకాయుక్త) చట్టం- 2013 ను పార్లమెంటు ఆమోదించడంతో 2014 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. జాతీయ స్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను విచారించేందుకు స్వయంప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను లోక్ పాల్ గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం మనదేశంలో 20 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.